టీవీ యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగనుంది. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించడంతో పాటు, ఈ యాప్‌ల కారణంగా పలువురు ఆర్థికంగా నష్టపోయారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్యామల విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నప్పటికీ, ఆమె హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూ చౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియలపై కూడా విచారణ కొనసాగుతోంది. గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. యాంకర్ శ్యామల పిటిషన్‌పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.