హైదరాబాద్‌లో మే 7 నుంచి 24 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు, మే 31న హైటెక్స్‌లో ఫైనల్ పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 140 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం రూ. 54 కోట్లు ఖర్చు కానుండగా, ప్రభుత్వం స్పాన్సర్ల సహాయంతో రూ. 27 కోట్లు వెచ్చించనుంది. మిగతా రూ. 27 కోట్లను మిస్ వరల్డ్ సంస్థ ఖర్చు చేయనుంది.
పోటీల వివరాలను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లే మీడియాకు వెల్లడించారు. ఈ పోటీలు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంతో పాటు, ఉపాధి, పెట్టుబడుల అవకాశాలు పెంచుతాయని మంత్రి తెలిపారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.
మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే మాట్లాడుతూ, ఈ పోటీలు కేవలం అందంతో కాకుండా అంతర్జాతీయ సంస్కృతులు, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. గతేడాది మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న క్రిస్టినా మాట్లాడుతూ, తన హృదయంలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భారతీయ చీర కట్టుకోవడం తనకు ఎంతో ఆనందానిచ్చిందని చెప్పారు.
పోటీల సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.