ఎమ్మెల్సీ కవిత పుట్టిన పార్టీపై బాంబు పేల్చినట్టే… నేతలే తనపై వ్యాఖ్యలు చేయించారని సంచలన ఆరోపణ
బీఆర్‌ఎస్ పార్టీ లోపలుగా సంక్షోభం పెరుగుతోందా? ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా అలా అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన బీసీ రిజర్వేషన్ల అంశంపై మీడియాతో మాట్లాడిన ఆమె, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి స్వయంగా పార్టీకి చెందిన పెద్ద నాయకులే ప్రోత్సహించారని తీవ్ర ఆరోపణ చేశారు. ఇదే కాకుండా తనపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడం బాధ కలిగించిందని అన్నారు.
ఎవరి గురించి మాట్లాడుతున్నారు?
కవిత సంచలనంగా పేర్కొన్న అంశాల్లో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక్కటి మినహా అన్ని స్థానాల్లో ఓడిపోయిన ఓ సీనియర్ నేత తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడం ఆసక్తికరమైంది. ఆయన పేరు వెల్లడించకపోయినా, ఈ వ్యాఖ్యలు పార్టీ ఆంతరంగిక పరిస్థితులపై తీవ్రంగా ప్రభావం చూపేలా ఉన్నాయి.
లేఖ లీక్ వ్యవహారంపై అనుమానాలు
తన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదని, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలతో పాటు, బీఆర్‌ఎస్ లో జరుగుతున్న ఇతర పరిణామాలకు సంబంధం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత రాజకీయం అవుతోంది.
ధీక్షకు అనుమతి లేకపోవడం పై ఆగ్రహం
బీసీ రిజర్వేషన్ల కోసం కవిత సోమవారం నుంచి హైదరాబాద్‌లో 72 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, ప్రభుత్వ అనుమతి లేదని వెల్లడించారు. తన నివాసం నుంచైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్, బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయని, నాటకాలాడుతున్నాయని ధ్వజమెత్తారు.
సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు?
బీసీ బిల్లు రాష్ట్రపతితో ఉన్నా, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించట్లేదు అని ప్రశ్నించారు. బీసీ హక్కుల కోసం ఆమె పోరాడతానని స్పష్టం చేశారు. అయితే ఇదంతా ఎన్నికల రాజకీయాల కోణంలోనూ విశ్లేషణకు తెరతీసింది.
పార్లమెంట్‌లో మౌనం ఎందుకు?
బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తూ, వారి మౌనం వెనుక నిజమైన కారణాలేమిటో బయటపడాలని ఆమె డిమాండ్ చేశారు.