తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. నందమూరి బాలకృష్ణ హీరోగా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతోంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటల్ రీస్టోరేషన్, 5.1 సౌండ్ మిక్సింగ్‌తో మరింత అత్యాధునికంగా రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఇప్పుడు 4K టెక్నాలజీ ద్వారా మరింత అందంగా తెరపై చూపించబోతున్నాం’’ అన్నారు.
ముందుగా ఏప్రిల్ 11న రీ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, థియేటర్లను ముందుగానే లాక్ చేయడంతో ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. నాటి టైమ్ ట్రావెల్ థ్రిల్లర్, ప్రస్తుతం కొత్త జనరేషన్ ప్రేక్షకులకు కూడా తప్పకుండా ఆసక్తికర అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన సంగీతం, అత్యాధునిక మిక్సింగ్‌తో మరింత ఆహ్లాదకరంగా ఉండనుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశానికి సాంకేతికంగా అత్యుత్తమమైన అప్‌గ్రేడ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆదిత్య 369’ రీ-రిస్టోర్ అయిన వెర్షన్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి!