తెలంగాణలో మ్యూల్ అకౌంట్ల ద్వారా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అక్రమ డబ్బుల లావాదేవీల కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడే ముఠాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించి చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలల్లో మొత్తం 228 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 93 మంది తెలంగాణ వాసులే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
జన్నారం (మంచిర్యాల) ప్రాంతంలో పట్టుబడ్డ ముఠాలో ముగ్గురు తెలంగాణ వారే ఉండగా, వీరికి కంబోడియా నుంచి జాక్ అనే వ్యక్తి ల్యాప్‌టాప్, డివైజ్‌లు పంపించడం ద్వారా కీలక ఆధారాలు లభించాయి.
సైబర్ మోసాలకు సంబంధించిన డేటా సిద్ధం చేసేందుకు వీరు రాజస్థాన్, హరియాణా, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాల్లోని నేరగాళ్లతో కలసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పత్రికానగర్‌లో నకిలీ కాల్ సెంటర్ కేసులో 63 మందిని గతంలో అరెస్ట్ చేశారు.
ఈ మోసాల వెనుక అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉంది. వీరు చైనా, దుబాయ్, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాల నుంచి ఆదేశాలు అందుకుంటున్నారు.
ముఖ్యంగా మ్యూల్ అకౌంట్లు ఇవ్వడం, వాటిని అక్రమంగా వాడి ప్రజలను మోసం చేయడం వలన శిక్షలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాల గురించి అప్రమత్తంగా ఉండాలి. తక్కువ శ్రమకు అధిక డబ్బు వచ్చే దందాల్లో ఎవరికైనా ఖాతా ఇవ్వడం ప్రమాదకరం.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇతర రాష్ట్రాల సైబర్ నేర విభాగాల సహకంతో నిఘాను పటిష్టం చేస్తోంది. ఇదే సమయంలో ప్రజలకు కూడా సైబర్ అవగాహన అవసరమని అధికారులు సూచిస్తున్నారు.