రేపు కేటిఆర్ నేతృత్వంలో బీ.ఆర్.ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ధర్నా ను అడ్డుకుంటామని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గిరిజన శక్తి ఆధ్వర్యం లో కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలోపోడు భూములు సాగు చేసే రైతులకు హరితహారం పేరిట పట్టాలు ఇవ్వకుండా భూములు లాక్కున్నారని, మహబూబాబాద్ లో నిర్మించిన వైద్య కళాశాల పేరిట అమాయక గిరిజన రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వారిపై కేసులు పెట్టి జైలు లో పెట్టినప్పుడు గిరిజనులకు జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం లో గిరిజన రైతులకు సంకెళ్లు వేశారని, గిరిజన మున్సిపల్ కౌన్సిలర్ గిరిజన బిడ్డ రవి ని హత మార్చారని ఆరోపించారు. లగచర్ల గిరిజనులను రెచ్చ గొట్టి బీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. కేటీఆర్ రేపటి ధర్నాకు హాజరైతే మానుకోట గిరిజనులు అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన శక్తి నేతలు పాల్గొన్నారు.
మహబూబాబాద్‌లో కేటీఆర్ పర్యటనకు గిరిజన శక్తి వ్యతిరేకం
