త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ట్రై సిరీస్‌లో పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా లాహోర్ గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సఫారీ జట్టుకు సరిపడా ఆటగాళ్లు లేకపోవడంతో వారి ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది.
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ టోర్నీ కోసం కేవలం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే, నిన్నటి మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు అనివార్య కారణాలతో మైదానం విడిచిపెట్టారు. దాంతో ఒక ఆటగాడు తక్కువ కావడంతో చేసేదేమీలేక ఫీల్డింగ్ కోచ్ గ్వావును బరిలోకి దించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.
దక్షిణాఫ్రికా జట్టుకు ఇది కొత్త అనుభవం కాదు. గతంలో అబుదాబిలో జరిగిన ఓ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల అనారోగ్య సమస్యల కారణంగా బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఇలా మళ్లీ ఒక కోచ్ మైదానంలోకి దిగడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే, మ్యాచ్ ఫలితంగా న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని కేన్ విలియమ్సన్ అజేయ శతకం (133)తో న్యూజిలాండ్ సునాయాసంగా చేధించింది. సఫారీ జట్టు ఆటగాళ్ల కొరతతో ఇబ్బంది పడినప్పటికీ, కివీస్ అద్భుత ఆటతీరుతో విజయం సాధించింది.