మంచు ఫ్యామిలీ వివాదంలో సిటీ సివిల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మంచు మనోజ్ కు హైదరాబాదులోని కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. మంచు విష్ణు పై యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. వారి మధ్య విభేదాలు విష్ణు పరువుకు హాని కలిగించాయని న్యాయవాదులు వాదించారు.
విష్ణు తరఫు న్యాయవాదులు కోర్టుకు అందించిన సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వివాదంలో మనోజ్ చర్యలు విష్ణుకు బాధ కలిగించాయని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల, ఈ వివాదం నడుస్తున్నప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సూచించింది.
ఇక, మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో తాను అరెస్టు కాకుండా ఉండేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ, హైకోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. హైదరాబాద్‌లోనే ఉన్నట్లు అఫిడవిట్‌లో చెప్పాలని సూచించింది.
తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు, ఆపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మంచు ఫ్యామిలీలో జరిగిన ఈ వివాదం మీడియా మరియు న్యాయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి.