Vande Mataram Guidelines: దేశవ్యాప్తంగా జాతీయ భావోద్వేగాలను మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థలు, అధికారిక వేడుకల్లో “జాతీయ గీతం ‘జనగణమన’కు ముందుగా జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఆలపించాల్సిందేనని” కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
దేశభక్తిని పెంపొందించడం, స్వాతంత్ర్య పోరాట చరిత్రను కొత్త తరానికి గుర్తు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఈ కొత్త మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.
వందేమాతరం సమయంలో లేచి నిలబడాలి
కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, “వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాలి”. ఇది గౌరవ సూచకంగా భావించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, సర్కారీ కార్యక్రమాల్లో ఈ నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
అదే విధంగా, రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాలు, జాతీయ పురస్కారాల ప్రదానోత్సవాల్లో కూడా ముందుగా వందేమాతరం ఆలపించాలని ఆదేశించింది.
సినిమా హాళ్లకు మినహాయింపు
ఈ కొత్త నిబంధనల్లో “సినిమా హాళ్లకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం”. థియేటర్లలో వందేమాతరం లేదా జనగణమనను ప్రదర్శించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు
జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో ఎవరైనా అంతరాయం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని. కొత్త నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేసి, గరిష్ఠంగా “మూడేళ్ల జైలుశిక్ష” విధించవచ్చని స్పష్టం చేసింది.
దేశ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలను సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వందేమాతరం చరిత్ర ఇదే
‘వందేమాతరం’కు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ప్రముఖ రచయిత “బంకించంద్ర ఛటర్జీ 1875లో తొలిసారిగా వందేమాతరం రచించారు”. ఆ తరువాత తన ప్రసిద్ధ నవల” ‘ఆనంద్‌మఠ్’లో”ఈ గేయాన్ని భాగంగా చేర్చారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం నినాదంగా మారింది. దేశమంతటా ఈ గేయం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.
స్వాతంత్ర్యానికి ముందు వచ్చిన వివాదాలు
స్వాతంత్ర్య పోరాట సమయంలో వందేమాతరంలోని కొన్ని పంక్తులపై “ముస్లింలీగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది”. మొత్తం ఆరు చరణాల్లో కొన్ని భాగాల్లో మతపరమైన భావనలు ఉన్నాయని పేర్కొంది.
దీంతో అప్పటి కాంగ్రెస్ నాయకత్వం చర్చించి, “మతపరమైన ప్రస్తావనలేని తొలి రెండు చరణాలను మాత్రమే స్వీకరించింది”. స్వాతంత్ర్యానంతరం, “నెహ్రూ ప్రభుత్వం వందేమాతరంలోని తొలి రెండు చరణాలను జాతీయ గేయంగా అధికారికంగా ప్రకటించింది”.
150వ వార్షికోత్సవాల సందర్భంగా కీలక నిర్ణయం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం “‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది”. ఈ నేపథ్యంలోనే ఈ తాజా నిబంధనలను తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే తాజా ఉత్తర్వుల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో “ఆరు చరణాలను ఆలపించాలన్న సూచనను కూడా కేంద్రం పొందుపరిచింది”. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
దేశభక్తిని బలోపేతం చేసే నిర్ణయం: కేంద్రం
ఈ నిర్ణయంతో దేశభక్తి భావన మరింత బలపడుతుందని కేంద్రం భావిస్తోంది. విద్యార్థుల్లో, యువతలో జాతీయ స్పూర్తి పెరుగుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో శాస్త్రీయంగా, క్రమబద్ధంగా ఈ నిబంధనలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు పంపింది.
