Rafale Fighter Jets: ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయని, మొత్తం ఆపరేషన్‌లో అవే నిజమైన హీరోలని ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ స్పష్టం చేశారు. ఎక్సర్‌సైజ్ వాయుశక్తి–2026 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని, భారత వైమానిక దళానికి మల్టీ రోల్ ఫైటర్ జెట్లు మరింత అవసరమని ఆయన తెలిపారు. ఇవి రాఫెల్ కావచ్చు లేదా ఇతర ఫైటర్ జెట్లు కావచ్చు, ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
భారత్‌పై జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు గట్టి ప్రతిస్పందన తప్పదని హెచ్చరించిన నాగేష్ కపూర్, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. రాఫెల్ జెట్లు స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.
ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అవసరమైతే పాక్ వైమానిక స్థావరాలపై కూడా భారత్ తీవ్రంగా స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.








