తెలుగు, తమిళ భాషల్లో ఐశ్వర్య రాజేశ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆమె నాయికా ప్రధానమైన సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా ఉంది. తాజాగా ఆమె నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘సుడల్ 2’ పేరుతో రూపొందిన ఈ సిరీస్, ఫస్ట్ సీజన్‌కు వచ్చిన స్పందన తర్వాత మరింత ఆసక్తిగా మారింది.
‘సుడల్’ తొలి సీజన్ 2022 జూన్ 17న స్ట్రీమింగ్ అయింది. ఆ థ్రిల్లర్ కథకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీజన్ 2 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది పూర్తయ్యి ఈ నెల 28 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఐశ్వర్య రాజేశ్, కాథీర్, గౌరీ కిషన్, మంజిమా మోహన్, పార్తీబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను పుష్కర్-గాయత్రి క్రియేటర్లు అందించారు. సర్జున్, బ్రహ్మ కలిసి దర్శకత్వం వహించారు.
ఫస్ట్ సీజన్ కథ విషయానికి వస్తే.. ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ షణ్ముగం కుమార్తె నీల, పోలీస్ ఆఫీసర్ రెజీనా తమ్ముడు అతిశయం ప్రేమలో ఉంటారు. ఊళ్లోవాళ్లు గుసగుసలాడే సమయంలోనే, వారి శవాలు చెరువులో తేలతాయి. ఇది ఆత్మహత్య కాదు హత్య అని నీల అక్కయ్య నందినికి (ఐశ్వర్య రాజేశ్) అనుమానం కలుగుతుంది.
ఇప్పుడు రెండో సీజన్‌లో కథ మరింత మలుపులు తిరగనుంది. నందినికి నిజాలు తెలియజేయకుండా కిల్లర్స్ ఎలాంటి కొత్త మోసాలకు పాల్పడతారు? మర్డర్ మిస్టరీని ఆమె ఎలా ఛేదించిందనేది ప్రధాన అంశం. మరి, ఈ సీజన్ కూడా మొదటి సీజన్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.