బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణం వెల్లడికాలేదు. మనోజ్ కుమార్ బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
‘పూరబ్ ఔర్ పాచిమ్’, ‘క్రాంతి’, ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ వంటి దేశభక్తి ప్రధాన చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రశంసలందుకున్నాయి. దేశభక్తి సినిమాల్లో ఎక్కువగా నటించడంతో ఆయనను అభిమానులు ‘భారత్ కుమార్’ అని పిలిచేవారు. నటనతో పాటు దర్శకత్వం, కథా రచన, పాటల రచన, ఎడిటింగ్ వంటి విభాగాల్లోనూ తన ప్రతిభను చాటారు.
మనోజ్ కుమార్ తన సినీ ప్రస్థానంలో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. భారత ప్రభుత్వం 1992లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 2015లో భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు గాను దేశ అత్యున్నత చలనచిత్ర పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.
మనోజ్ కుమార్ మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. భారతీయ సినిమా ప్రపంచంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు వ్యాఖ్యానించారు.