సినీ హీరోలకు విపరీతమైన అభిమానులు ఉంటారు. కొందరు అభిమానులు తమ అభిమాన హీరో కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. పోస్టర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం సహజమే. అయితే ముంబైకి చెందిన నిషా పాటిల్ అనే మహిళ తన ఆస్థి మొత్తం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పేరిట రాసిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నిషా పాటిల్ వయసు 62 సంవత్సరాలు. బాల్యం నుంచే సంజయ్ దత్‌కు వీరాభిమానిగా ఉండేది. ఆయన నటించిన ప్రతి సినిమాను అనేకసార్లు చూసేది. తన జీవితం చివరి దశకు చేరిందని గ్రహించిన ఆమె, 2018లోనే తన రూ.72 కోట్ల విలువైన ఆస్తిని సంజయ్ దత్‌కు అప్పగించేలా వీలునామా రాశారు.
ఆమె మరణం తర్వాత, ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్ ఇంటికి చేరాయి. విషయం తెలుసుకున్న సంజయ్ దత్ షాక్‌కు గురయ్యారు. తనకు పరిచయం లేని వ్యక్తి తన పేరున ఆస్తి రాసివ్వడం ఆయనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
అయితే, సంజయ్ దత్ ఆ ఆస్తిని స్వీకరించలేదు. తన లీగల్ టీమ్‌ను సంప్రదించి, ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికే చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంత గొప్ప అభిమానిని వ్యక్తిగతంగా కలవలేకపోవడం బాధగా ఉందని, కనీసం ఆమె కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.