తెలుగుదేశం పార్టీ నేత, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఆసుపత్రి విస్తరణలో భాగంగా తుళ్లూరులో కొత్త క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం వచ్చే 8 నెలల్లో పూర్తి అవుతుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ శనివారం పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్యాన్సర్ చికిత్సను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
క్యాన్సర్ బాధితులకు మంచి సేవలు అందించడం తమ ఆసుపత్రి లక్ష్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు దక్కాయని తెలిపారు. పేదలకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో, తుళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కీలక పరిణామమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యసేవలు మరింత విస్తరించేందుకు ఇదొక కీలక ముందడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.