Vladimir Putin Warning: యూరప్ నాయకులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని “చిన్న పందులు”గా అభివర్ణిస్తూ, ఉక్రెయిన్(ukraine)లో రష్యా లక్ష్యాలను దౌత్య మార్గంలో గానీ, అవసరమైతే సైనిక చర్యల ద్వారానే గానీ సాధిస్తామని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన రక్షణ మంత్రిత్వ శాఖ వార్షిక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయవంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కీవ్ ప్రభుత్వం, యూరప్ నేతలు చర్చలకు సిద్ధంగా లేకపోతే, చారిత్రకంగా తమవని రష్యా భావించే భూభాగాలను యుద్ధరంగంలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
ALSO READ:VB G RAM G Bill | ఉపాధి హామీకి గుడ్‌బై.. ‘VB జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అంతర్జాతీయ వివాదాల్లో రష్యా ఎప్పుడూ దౌత్య పరిష్కారాలకు ప్రాధాన్యం ఇస్తుందని పుతిన్ తెలిపారు. అయితే బలవంతంగా ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తే, అటువంటి చర్యలు అవకాశాలు కోల్పోవడానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు.
అమెరికా మద్దతుతో వచ్చిన శాంతి ప్రతిపాదనలకు యూరప్ నేతలు స్పందించకపోతే, ఉక్రెయిన్‌లో మరింత భూభాగాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కూడా సూచించారు.
ఉక్రెయిన్ భూభాగంలో సుమారు 19 శాతం ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉందని మాస్కో చెబుతోంది. 2025లో రష్యా తన జీడీపీలో 5.1 శాతం యుద్ధ ఖర్చులకే వెచ్చిస్తున్నట్లు రక్షణ మంత్రి వెల్లడించారు.
మరోవైపు పుతిన్ వ్యాఖ్యలను యూరప్ నేతలు ఖండిస్తూ, రష్యాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
