మంచు కుటుంబ వివాదంపై స్పందించనన్న విష్ణు

Vishnu Manchu refused to comment on the family dispute, focusing on 'Kannappa' promotions. His cryptic response sparked more speculation. Vishnu Manchu refused to comment on the family dispute, focusing on 'Kannappa' promotions. His cryptic response sparked more speculation.

గత కొన్నిరోజులుగా మంచు కుటుంబంలో తండ్రీకొడుకుల మధ్య జరుగుతున్న వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తలెత్తిన గొడవ తీవ్ర స్థాయికి చేరింది. హైదరాబాద్లోని జల్‌పల్లి ప్రాంతంలో మంచు మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన మరింత సంచలనంగా మారింది. ఈ గొడవలో మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడటంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో మంచు కుటుంబ సభ్యులు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. మంచు విష్ణు, మంచు మనోజ్ వరుస పోస్టుల ద్వారా ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణుకు తన కుటుంబ వివాదంపై ప్రశ్న ఎదురైంది. ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, “మంచు మనోజ్ దేనికోసం పోరాటం చేస్తున్నారు?” అనే ప్రశ్న ఎదురైంది.

దీనిపై మంచు విష్ణు తనదైన శైలిలో స్పందించారు. “నేను ఇక్కడ నా మూవీ ‘కన్నప్ప’ ప్రమోషన్ కోసం ఉన్నాను. దయచేసి సినిమాపై ప్రశ్నలు అడగండి. కుటుంబ గొడవ గురించి మాట్లాడదలుచుకోలేదు” అని తెలిపారు. అయితే, అనంతరం విష్ణు ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “మనం చేసే చర్యలే మన వైఖరి తెలియజేస్తాయి. జనరేటర్‌లో పంచదార, ఉప్పు పోస్తే అవి ఫిల్టర్ ప్రాసెసింగ్‌లో ఆగిపోతాయి, కానీ జనరేటర్ పేలదు” అంటూ గూఢార్థంగా సమాధానం ఇచ్చారు.

విష్ణు ఇచ్చిన ఈ సమాధానం కొత్త చర్చకు దారితీసింది. ఆయన మాటల్లో తన కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు ఉన్నాయా? లేదా నిజంగా తన సినిమాపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారా? అనే విషయంలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ‘కన్నప్ప’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు కుటుంబ వివాదం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *