దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో మార్కెట్‌లో సానుకూలత నెలకొంది. ట్రంప్ 90 రోజుల పాటు టారిఫ్ లను తాత్కాలికంగా ఆపుతున్నట్టు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లకు ఊరట లభించింది.
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోన్న నేపథ్యంలో ఈ తాత్కాలిక ఉపశమన చర్య ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసింది. మన మార్కెట్లు కూడా ఈ ప్రకటనతో జోష్ పట్టాయి. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ మార్కెట్లపై ఇది నెగటివ్ ప్రభావం చూపలేకపోయింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,310 పాయింట్ల వృద్ధితో 75,157కి ఎగబాకింది. నిఫ్టీ 429 పాయింట్లు లాభపడి 22,828 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే రూ. 86.05గా ఉంది. ఈ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టాప్ గెయినర్స్ గా టాటా స్టీల్ (4.91%), పవర్ గ్రిడ్ (3.72%), ఎన్టీపీసీ (3.25%), కోటక్ బ్యాంక్ (2.85%), రిలయన్స్ (2.84%) నిలిచాయి. మార్కెట్ నిపుణులు ట్రంప్ నిర్ణయం తాత్కాలికంగా లాభకరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం మరింత జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.