హిందూ సంప్రదాయాల్లో శివాలయాల్లో గర్భగుడి ముందు నందీశ్వరుని విగ్రహం ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. భక్తులు నంది కొమ్ముల్లోంచి శివుడిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని నమ్మకం. అయితే ఓ టీవీ కార్యక్రమంలో ఈ పవిత్ర విశ్వాసాన్ని హాస్యంగా చిత్రీకరించడం పెద్ద దుమారానికి దారి తీసింది.
సుడిగాలి సుధీర్ బృందం రూపొందించిన ఓ స్కిట్‌లో, నంది కొమ్ముల్లోంచి చూస్తే శివునికి బదులుగా ఒక యువతి కనిపించేలా చూపించారు. ఇది హిందూ భావోద్వేగాలను దెబ్బతీసిందని పలువురు పేర్కొన్నారు. హిందూ సంఘాలు ఈ స్కిట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, బాధ్యత వహించాలంటూ హోస్ట్ యాంకర్ రవి, సుధీర్‌లపై విమర్శలు గుప్పించాయి.
ఈ వివాదం నేపథ్యంలో యాంకర్ రవి స్పందించారు. “ఇది ఒక సినిమా స్పూఫ్ మాత్రమే. ఎవరి మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం లేదు. అయితే అనేక మంది హిందువులకు ఇది బాధ కలిగించింది. మా వైఫల్యం అర్థమైంది. మేము ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతాం” అంటూ ఓ వీడియో ద్వారా క్షమాపణలు తెలిపారు.
వీడియోలో రవి “జై శ్రీరామ్… జై హింద్” అంటూ ముగించారు. అయితే ఇప్పటికే వివాదం పెద్దదవడంతో ఈ క్షమాపణలపై హిందూ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసిన ఈ స్కిట్‌పై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.