ఆక్సిజన్ టవర్ ఘటన మరవకముందే విశాఖలో మరో ఘటన కలకలం రేపింది. శ్రీనగర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి ర్యాపిడో బుక్ చేసిన మణికంఠ అనే వ్యక్తి, రైడ్ మధ్యలో బైక్ ఆపమని చెప్పి రైడర్‌ను బెదిరించాడు. కణితి స్మశాన వాటిక సమీపంలో బైక్ ఆగిన వెంటనే అతడు తన అసలైన ఉద్దేశాన్ని బయటపెట్టాడు.
విషయం సీరియస్ అవుతూ, రైడర్‌పై దాడి చేసి ఫోన్ పే ద్వారా ₹48,000 లు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని పరారయ్యాడు. కష్టపడి పని చేసి కూడబెట్టుకున్న డబ్బంతా మాయం కావడంతో బాధితుడు తీవ్ర దిగులు చెందాడు. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు, ఫోన్ పే నెంబర్ ఆధారంగా నిందితుడిని తక్కువ సమయంలోనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ర్యాపిడో వంటి ప్లాట్‌ఫాంలలో పని చేసే గిగ్ వర్కర్స్ భద్రతపై ప్రశ్నలు మొదలయ్యాయి.
రోజువారీ ఖర్చులకు తగిన ఆదాయం రాలేదని, జీతాలు సరిపోవని గిగ్ వర్క్ చేస్తూ బతికే వారు ఇలాంటివి చూస్తే భయపడాల్సిందే. బతుకుతెరువు కోసం రోడ్లపైకి వచ్చి నిస్సహాయంగా ఉన్న ఈ వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది.