అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని మహిళలతో ప్రత్యేక వీడియో రూపొందించారు. “మెగా ఉమెన్స్” పేరిట రికార్డ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, నాగబాబు, వారి తల్లి అంజనా దేవి, చెల్లెళ్లు మాధవి, విజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన చిన్ననాటి సంఘటనను పంచుకుని, తాను చిన్నప్పుడు రోడ్డుపై పోయి తల్లిని కంగారు పెట్టిన విషయాన్ని చెప్పి, తాను శ్రీకృష్ణుడి మాదిరినని చమత్కరించారు.
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చిన్నప్పటి విషాదకర సంఘటనను వెల్లడించారు. తాము ఐదుగురమే కానీ చిన్ననాట ముగ్గురు చనిపోయారని తెలిపారు. తాను 6వ తరగతిలో ఉండగా, తన సోదరి రమ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మరణించిందని, ఆ బాధను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని పేర్కొన్నారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఇంట్లో లేనందున, తానే బాధ్యత తీసుకుని ఆమెను ఇంటికి తీసుకువచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
మెగా కుటుంబ మాతృమూర్తి అంజనా దేవి ఉమెన్స్ డే సందర్బంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని, పరస్పర ప్రేమ, అండదండలు కొనసాగాలని సూచించారు. నేటి తరంలో ప్రేమలు తగ్గిపోతున్నాయనే బాధ తనకు ఉందని చెప్పిన ఆమె, చిరంజీవి భార్య సురేఖను కూతురుగా భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, తమ ఇంట్లో తల్లికి పవన్ కల్యాణ్ అంటేనే ఎక్కువ అనుబంధమని వెల్లడించారు. చిన్నప్పుడు పవన్ బలహీనంగా ఉండటంతో తల్లి అతడిపై ఎక్కువ శ్రద్ధ పెట్టేదని తెలిపారు. పవన్‌కు ఇష్టమైన వంటకాలు ప్రత్యేకంగా తయారు చేసేది తల్లేనని, అందుకే అతడిపై తల్లికి ప్రత్యేక ప్రేమ ఉందని చెప్పారు.