దేశంలో రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న ఉచిత పథకాల పోటీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బహుమతులతో ఎన్నికలు గెలవవచ్చేమో కానీ, ఆ విధానం దేశ నిర్మాణానికి ఏమాత్రం సహాయపడదని ఆయన స్పష్టం చేశారు.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాసిన వ్యాసంలో సుబ్బారావు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అనుసరిస్తున్న ఉచితాల విధానాన్ని కఠినంగా విమర్శించారు.
ALSO READ:ED Issues Notice to Kerala CM | కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు
ఒకప్పుడు ‘రేవ్‌డీ కల్చర్’ను విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇప్పుడు అదే దారి మీద నడుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక్క పార్టీ బాధ్యత కాదని, మొత్తం రాజకీయ వ్యవస్థలో బలహీనతలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు. హామీలు నమ్మశక్యం కాకపోతే ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందని అన్నారు.
ఉచిత పథకాల పెరుగుదల రాజకీయ వైఫల్యానికి నిదర్శనమని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ప్రజలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించలేకపోవడం వల్లే ప్రభుత్వాలు ఈ తాత్కాలిక ప్రయోజనాలను ఆశ్రయిస్తున్నాయని అన్నారు.
కీలకమైన ఉద్యోగ సృష్టి, ఉత్పాదకత పెంపు వంటి అంశాలపై చర్చ జరగకపోవడంతో దేశ అభివృద్ధి దెబ్బతింటోందని తెలిపారు.
ఉచితాల కోసం అప్పులు తెచ్చి ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం భవిష్యత్ తరాలపై భారమవుతుందని ఆయన హెచ్చరించారు. ఆర్థిక నియంత్రణ వ్యవస్థలు బలహీనపడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ కూడా ఉచిత విధానాలను విమర్శించే ధైర్యం చేయలేకపోతోందని ఆయన విశ్లేషించారు.
