Rajasthan Collector Decision: దేశంలో నిజాయితీగా క్రమశిక్షణతో పని చేసే కలెక్టర్లను చాలా అరుదుగా చూస్తుంటాం. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజస్థాన్‌కు చెందిన ఓ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాజ్‌సమండ్ జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ హసిజా, ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పూర్తిగా అందేవరకు తాను జీతం స్వీకరించనని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పాటు తన ఆధ్వర్యంలోని అధికారులు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
పేదరికాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు ప్రధాన పథకాలు జిల్లాలోని ప్రతి అర్హ వ్యక్తికి చేరేలా చూస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు.
ALSO READ:India vs new zealand series: గంభీర్ కోచింగ్‌పై ట్రోలింగ్.. తప్పించాలన్న డిమాండ్లు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మాకు జీతం కొన్ని రోజులు ఆలస్యమైనా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటప్పుడు పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలు, చదువుకోలేని పిల్లలు, వికలాంగులు, వృద్ధులు ఎదుర్కొనే కష్టాలు ఎంత తీవ్రమైనవో అర్థం చేసుకోవాలి.
పథకాల కోసం నమోదు ప్రక్రియలోనే వారు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వ ప్రయోజనాలు తప్పకుండా వారికి చేరాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను” అని తెలిపారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజ్‌సమండ్ జిల్లాలో సుమారు 30,000 మంది ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఉన్నారు. వీరి కోసం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత రేషన్, అనాథ పిల్లల కోసం పలన్హార్ యోజన, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ వంటి పథకాలు అమలులో ఉన్నాయి.
అయితే ఇంకా అనేక మంది ఈ ప్రయోజనాలకు దూరంగా ఉండటంతో కలెక్టర్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
