జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి నేతృత్వం వహించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, పట్టణ యువత విభాగం అధ్యక్షుడు భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వీరు మాట్లాడుతూ, అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి నిలదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతును నొక్కే ధోరణిని అవలంబిస్తోందని, ప్రజా ప్రతినిధులను అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి ప్రశ్నించినప్పటికీ, ముఖ్యమంత్రి సహా మంత్రులు స్పందించకపోవడం ప్రజలను మోసం చేసినట్టే అని బీఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బీఆర్‌ఎస్ నాయకులు గోపి గౌడ్, బాలరాజ్, గెరిగంటి లక్ష్మీ నారాయణ, మల్లేష్, పిప్పిరి వెంకట్, మల్లేష్ యాదవ్, నరేష్ రెడ్డి, వెంకటి, రాజు, లత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఈ సమస్యపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.