హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 13న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు సేవా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా ఆనంద్, సృజన, పరుచూరి, జమున, డాక్టర్ వంగా ప్రసాద్, తీగల సత్యం, గంగి మల్లేశం హాజరై అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వారి ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రస్ట్ చైర్‌పర్సన్ గల్లా సంతోషమ్మ మాట్లాడుతూ, నారీ శక్తి లేకుండా సమాజ అభివృద్ధి అసాధ్యమని, మహిళల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ట్రస్ట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, తమ సేవల కోసం ఎటువంటి ఫండ్స్ సేకరించలేదని, తమ జీతంలో 10% భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఈ విధంగా జరిపి, విశిష్ట సేవలు అందించిన మహిళలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు గౌరవనీయులతో పాటు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలు, ట్రస్ట్ సభ్యులు, సమాజ సేవకులు పాల్గొన్నారు. సన్మానిత మహిళలు ఈ గౌరవాన్ని అందుకోవడం సంతోషకరమని, భవిష్యత్తులో మరింత కృషి చేస్తామని తెలియజేశారు.