ఒడిశాలోని గహీర్ మఠ తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మహా వలస ప్రారంభమైంది. గడిచిన 12 రోజుల్లోనే 7 లక్షల తాబేళ్లు ఈ తీరానికి చేరుకున్నాయని భారత మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ తెలిపారు. ప్రపంచంలోని అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ తీరానికి వస్తున్నాయని వివరించారు.
ప్రతి ఏడాది తాబేళ్లు గహీర్ మఠ తీరాన్ని సురక్షిత ప్రదేశంగా భావించి ఇక్కడ గుడ్లు పెడతాయి. వెన్నెల రాత్రుల్లో తీరంపై గుడ్లు పెడతాయని, ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. లక్షలాది తాబేళ్లు సముద్రపు అలలతో తీరం చేరి గూళ్లు తయారు చేసుకోవడం విశేషం.
తాబేళ్ల సంరక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తీరప్రాంతాల్లో చేపల వేటను నిషేధించడంతో పాటు పర్యాటకుల రాకపోకలను నియంత్రిస్తోంది. గుడ్లను పరిరక్షించేందుకు అటవీ శాఖ సిబ్బందిని మోహరించింది.
తాబేళ్ల వలస, గుడ్ల సంరక్షణ ప్రక్రియను చూడటానికి ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి చర్యలు ఎంతో అవసరమని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు.