ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టోర్నీలో భారత్ మాస్టర్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాస్టర్స్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు తలొగ్గారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమయ్యారు. మ్యాడీ (25), టీమ్ ఆంబ్రోస్ (23) మినహా మరెవరూ రాణించలేదు. ధవళ్ కులకర్ణి 3 వికెట్లు, పవన్ నేగి, అభిమన్యు మిథున్ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.
133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత్ మాస్టర్స్ 11.4 ఓవర్లలోనే విజయాన్ని ఖాయం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనదైన స్టైల్లో 21 బంతుల్లో 34 పరుగులు బాదాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైన సచిన్, ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.
గురుకీరత్ (63 నాటౌట్), యువరాజ్ సింగ్ (27 నాటౌట్) అద్భుతంగా ఆడి మరో వికెట్ కూడా కోల్పోకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్ మాస్టర్స్ ఈ విజయం ద్వారా లీగ్‌లో తన స్థాయిని మరింత బలపరుచుకుంది.