నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త పథకాలు రూపొందించారు. రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ విధంగా మోసపోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల చేతుల్లో పడుతుంది.
స్మార్ట్ ఫోన్లకు “నూతన సంవత్సర శుభాకాంక్షల” పేరుతో సందేశాలు పంపిస్తూ, లింక్ పై క్లిక్ చేయమని కోరుతున్నారు. ఒకసారి ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో మాల్వేర్ మీ ఫోన్లోకి ప్రవేశించి మొత్తం సమాచారం నేరగాళ్లు స్వాధీనం చేసుకుంటారు.
అంతేకాదు, ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు, బ్యాంకు ఖాతాల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు తదితరాలన్నీ చోరీ చేయబడే ప్రమాదం ఉంది. ప్రజలు పొరపాటున కూడా ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, నూతన సంవత్సర సందేశాల విషయంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ మోసాలు మరింత తీవ్రతరం కావచ్చని హెచ్చరించి, సైబర్ భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.