నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనం మరింత తగ్గిపోయి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు విస్తరించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ మార్పులు కొనసాగుతున్నాయి. మత్స్యకారులకు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ చిరుజల్లులు పడే అవకాశముందని, చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ ఏడాదికి ఇవే చివరి వానలుగా వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల పాటు చలి గాలుల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. జనవరి రెండవ వారానికి ఈ పరిస్థితి కొనసాగవచ్చని స్పష్టం చేశారు.
వచ్చే వేసవికాలం వరకు వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చు. వర్షాకాలం ముగిసిన తర్వాత అల్పపీడనాలు, తుపాన్లు ఈ ఏడాదిలో చాలా ప్రభావం చూపిన విషయం తెలిసిందే. కానీ, ఇకపై ఏప్రిల్ వరకు పెద్ద వర్షాలు లేకుండా వాతావరణం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.








