నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డులో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను తొలగించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ, కౌన్సిలర్లతో కలిసి వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారం చేసుకునేలా వీలుచూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో కలిసి వ్యాపారస్తుల సమస్యలను అర్థం చేసుకుని, వారికి సహాయపడేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూరగాయల మార్కెట్ పూర్తిగా నిర్మాణం పూర్తైన తర్వాత, అందరికీ అక్కడే స్థలం కేటాయించి, వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
అదనంగా, ఆటో రిక్షాల కోసం గిరిజ హాల్ వద్ద ప్రత్యేక స్టాండ్ ఏర్పాటు చేసి, ఒకొక్క ఆటో వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లేలా నియమాలు రూపొందిస్తామని తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, చిరు వ్యాపారస్తుల జీవనోపాధికి ఆటంకం కలగకుండా సమతుల్యత పాటిస్తామన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వ్యాపారస్తులు తమ సమస్యలను వివరించి, ప్రభుత్వం నుంచి సహాయాన్ని కోరారు. ఎమ్మెల్యే, స్థానిక ప్రతినిధులు వారిని ఓదార్చి, త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.