Gold Scam: బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్యులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. ఇదే అవకాశంగా భావించిన కేటుగాళ్లు తక్కువ ధరకు బంగారు నాణేలు ఇస్తామని నమ్మించి భారీగా మోసం చేశారు. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు(Penamaluru) శివారులో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. నరసరావుపేటకు చెందిన తిరుపతిరెడ్డి విజయవాడలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పరిచయమై, బిల్లులు లేని బంగారు నాణేలను తక్కువ ధరకు ఇస్తానని చెప్పాడు.
వీడియో కాల్ ద్వారా కొన్ని నాణేలు చూపించి నమ్మకం కలిగించాడు. మొత్తం 20 గ్రాముల బరువున్న 17 బంగారు నాణేలకు రూ.37.40 లక్షలు అవుతాయని చెప్పాడు.
అయితే తమ వద్ద రూ.20.50 లక్షలు మాత్రమే ఉన్నాయని తిరుపతిరెడ్డి, అతడి బంధువు మల్లారెడ్డి తెలిపారు. దీంతో నగదు తీసుకుని పెనమలూరు శివారు గంగూరులోని డీమార్ట్ వద్దకు రావాలని కేటుగాళ్లు సూచించారు. అక్కడికి చేరుకున్న బాధితులను గుర్తు తెలియని వ్యక్తి కలసి, రోడ్డుకు అవతల కారులో నాణేలు ఉన్నాయని చెప్పి నగదు బ్యాగ్ తీసుకున్నాడు.
తిరుపతిరెడ్డి కారు వద్దకు వెళ్లేలోపే శ్రీనివాసరెడ్డి సహా మరో వ్యక్తి కారుతో పరారయ్యారు. కారు డోర్ పట్టుకునే ప్రయత్నంలో తిరుపతిరెడ్డికి గాయాలయ్యాయి. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ:Telangana Regional Ring Road | భూసేకరణ, టెండర్లపై కీలక నిర్ణయం
