Gujarat Bomb Threats: గుజరాత్లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్ నగరంలోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
ALSO READ:MS Dhoni retirement IPL 2026 | ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్?
నగర పరిధిలోని మహారాజా అగ్రసేన్ స్కూల్, వేజల్పూర్ జైడస్ స్కూల్, నిర్మాణ్ స్కూల్, డివైన్ స్కూల్, ఆవిష్కర్ స్కూల్, కలోల్ దేవ్ ఇంటర్నేషనల్ స్కూల్ సహా పలు ప్రముఖ విద్యాసంస్థలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలల ఆవరణలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు ఈమెయిల్స్‌లో పేర్కొనడంతో యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు పాఠశాలలకు చేరుకుని విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బెదిరింపు ఈమెయిల్స్ వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
