గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి, అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. జనవరి 4న రాజమండ్రిలో మరొక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఇప్పటికే విడుదలైన పాటలు మరియు టీజర్‌కు మంచి స్పందన లభించింది. వీటి ప్రభావంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కొత్త సంవత్సర సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. రేపు (జనవరి 2) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌ఎస్ థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.
గేమ్ ఛేంజర్లో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చరణ్ పంచె కట్టుతో ఉన్న పోస్టర్ మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల అంచనాలను అందుకునే సినిమాగా ఇది మారబోతోందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.