గద్వాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ

నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రాంలో భాగంగా గద్వాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ పాల్గొన్నారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, విద్యార్థులకు అవసరమైన చికిత్స అందించాలని వారు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లలకు కంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అహారపు అలవాట్లు, మొబైల్ వినియోగం వంటి అంశాల వల్ల పిల్లల్లో కంటి సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ అంశంపై డాక్టర్లు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. కంటి ఆరోగ్యంపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంతేకాకుండా, గత ఐదారు సంవత్సరాల్లో గద్వాల జిల్లాలో అక్షరాస్యత శాతం గట్టిగా పెరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గట్టు, కేటి దొడ్డి మండలాల్లో 18% మాత్రమే ఉన్న అక్షరాస్యత శాతం ప్రస్తుతం 41%కి పెరిగిందని వివరించారు. ఇంకా వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

కేడిదొడ్డి మండలంలో 25 ఎకరాలలో రూ.200 కోట్లతో గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *