మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జైసంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహించి ప్రజల మద్దతు పొందారు. అనంతరం రేషన్ షాపులో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందజేశారు. అలాగే మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు పురుగులు పట్టిన బియ్యం ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో కొత్త పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రామాయంపేటలో 200 కోట్లతో నిర్మాణం చేపట్టారని, విద్యార్థులకు సమీపంలోనే ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని రోహిత్ రావు తెలిపారు. 22 వేల కోట్ల రుణమాఫీ, 7000 కోట్ల రైతు భరోసా పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ విధానాల వల్ల ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని అన్నారు.
మెదక్ నియోజకవర్గ అభివృద్ధి తన ముఖ్య లక్ష్యమని, ప్రజల మధ్య కుటుంబ సభ్యుడిలా ఉండి వారికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ రమ్యశ్రీ, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.