విజయనగరం జిల్లా చారిత్రక వారసత్వంగా ఉన్న కోటను సుందరీకరించేందుకు జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ అధికారులను ఆదేశించారు.
అక్టోబర్ నెలలో జరగనున్న విజయనగర ఉత్సవాలకు ముందుగా ఈ సుందరీకరణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు.
స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతిరాజుతో కలిసి, కలెక్టర్ సోమవారం కోట వెలుపల ప్రాంతాన్ని సందర్శించారు.
కోట గోడ చుట్టూ సుందరీకరణకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, అధికారులతో చర్చించిన కలెక్టర్, పనులు మంగళవారం నుండి ప్రారంభించాలని స్పష్టం చేశారు.
కోట గోడపై అన్నివైపులా లైటింగ్ ఏర్పాటు చేయాలని మరియు కందకాలను శుభ్రంగా నింపాలని కలెక్టర్ సూచించారు.
సందర్శకులు కూర్చునేందుకు ఖాళీ స్థలంలో సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
కోటకు దక్షిణ వైపు లైట్ అండ్ షో నిర్వహించడం ద్వారా విజయనగర చరిత్రను ప్రదర్శించేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కోట సుందరీకరణలో భాగంగా, 16 కుటుంబాలకు పునరావాసం కల్పించాలన్నా కలెక్టర్ తహశీల్దార్‌ను ఆదేశించారు.