నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి పరీక్షా పత్రం లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఓ విద్యార్థినిని డిబార్ చేసిన అధికారులు, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే, తన తప్పేమీ లేదని బాధిత విద్యార్థిని వాపోయింది. పరీక్ష రాస్తుండగా ఇద్దరు యువకులు బెదిరించారని, పేపర్ చూపించకపోతే కొడతామని హెచ్చరించారని పేర్కొంది. భయంతో పేపర్ చూపించానని, కానీ ఆ యువకులు ఎవరో తనకు తెలియదని ఆమె వివరించింది.
ఈ ఘటన శుక్రవారం నకిరేకల్‌లోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. గోడ దూకి లోపలికి వచ్చిన యువకులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి బయటకు వెళ్లిపోయారు. ఆపై సమాధానాలను వెతికి, జిరాక్స్ తీసి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసి, ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది.
ఎంఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పరీక్షా పత్రం లీక్ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు, స్కూల్ సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
తనను అన్యాయంగా డిబార్ చేశారంటూ బాధిత విద్యార్థిని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన తప్పేమీ లేదని, పరీక్ష రాయడానికి అనుమతించాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ లీక్‌కు అసలైన బాధ్యులు ఎవరు? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.