బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో రియా చక్రవర్తిని దోషిగా చూపిస్తూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించారని నటి దియా మీర్జా మండిపడ్డారు. సీబీఐ తాజాగా ఇచ్చిన నివేదికలో సుశాంత్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని, ఆయనే ఆత్మహత్య చేసుకున్నారని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అప్పట్లో రియాపై తప్పుడు ఆరోపణలు చేసిన మీడియా ఇప్పుడు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
టీఆర్‌పీ కోసం ముఖ్యమైన అంశాలను వదిలేసి అనవసర ప్రచారం చేయడమే మీడియా లక్ష్యమని దియా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం తర్వాత రియాను, ఆమె కుటుంబాన్ని పూర్తిగా విలన్‌లుగా చూపించారని ఆరోపించారు. ఆమెను తప్పుబట్టేలా కథనాలు సృష్టించారని, ఇప్పుడు సీబీఐ స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత మీడియా తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని దియా పేర్కొన్నారు.
దీంతో పాటు సుదీర్ఘ విచారణలో రియాకు ఎలాంటి సంబంధం లేదని తేలినా, ఆమెపై చేసిన అవతాళి ప్రచారం ఆమె జీవితాన్ని బాగా ప్రభావితం చేసిందని దియా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిగా చూపించి, అనవసరంగా విచారించారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వ్యక్తిగత జీవితాలను నాశనం చేయవచ్చని దియా హెచ్చరించారు.
ఈ అంశంపై రియా చక్రవర్తి ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తి మాత్రం ‘సత్యమేవ జయతే’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రియాతో కలిసి ఫొటో షేర్ చేశారు. ఈ వ్యవహారం మరొక్కసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.