అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఓ ఉద్యోగిపై బహిరంగంగా దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, రిబ్బన్ కలర్ విషయంపై ఆగ్రహించి అక్కడి ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భూమిపూజ కార్యక్రమంలో కత్తిరించడానికి రెడ్ రిబ్బన్ బదులుగా పింక్ రిబ్బన్ కట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఎందుకు పింక్ రిబ్బన్ కట్టారని అక్కడి ఉద్యోగిని ప్రశ్నించారు. రెడ్ రిబ్బన్ అందుబాటులో లేకపోవడంతో పింక్ రిబ్బన్ వేశామని ఉద్యోగి సమాధానం ఇచ్చాడు. అయితే, ఆ సమాధానంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే సంసుల్ హుడా ఆ ఉద్యోగిని ముందుకు లాగి చెంప చెళ్లుమనిపించాడు.
దీనితో ఆగకుండా, ఎమ్మెల్యే దగ్గర ఉన్న అరటి బోదెను తీసుకుని ఆ ఉద్యోగిపై దాడి చేశాడు. అక్కడి అధికారులు, ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధి ఇలాంటి చర్యలకు దిగడమా? అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే సంసుల్ హుడా వ్యవహారంపై అధికార పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.