వై. విజయ .. తనదైన రూట్లో ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతూ వెళ్ళిన నటి. ఆమె సుదీర్ఘ కాలంగా తన కెరియర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె తన కెరియర్ సంబంధిత అనేక విషయాలను ప్రస్తావించారు. “చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చాను. కెరియర్ ఆరంభంలోనే హీరోయిన్ గా చేశాను. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను” అని అన్నారు.
“మా పల్లెలో గోపాలుడు” సినిమాలో నేను చేసిన ‘పులుసు’ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తరువాత మా ఇంట్లో ఫోన్ అలా మోగుతూనే ఉండేది. రోజుకి ఐదు ఆఫర్లు వచ్చేవి. ఆ ఏడాది నేను చేసిన సినిమాల సంఖ్య ఎక్కువ. ఆ సినిమాల డబ్బుతో నేను చెన్నైలో స్థలం కొన్నాను .. ఇల్లు కట్టాను. తెలుగు నిర్మాతలు నాకు వరుసగా అవకాశాలు ఇవ్వడం వల్లనే అది సాధ్యమైంది” అని ఆమె తెలిపారు.
“‘మా పల్లెలో గోపాలుడు’ తరువాత నేను చేసిన సినిమాల సంఖ్య పెరిగింది. కానీ నేను నా పారితోషికం పెంచలేదు. నిర్మాతలను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను వందల కోట్లు సంపాదించి ఉంటానని అనుకుంటున్నారు. పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ వెళితే ఉండేవేమో. కానీ మేము అలా చేయలేదు. స్థిరాస్థులు సంపాదించుకున్నాము .. డబ్బుకు ఇబ్బంది లేకుండా .. ఎవరినీ అప్పు అడిగే పరిస్థితి రాకుండా చూసుకున్నాం .. అది చాలు” అని విజయ అన్నారు.