పెళ్లి పందిట్లో యాసిడ్ దాడి. వివాహేతర సంబంధం ఆధారంగా ఘర్షణ, నందలూరులో సంచలన ఘటన

కాసేపట్లో మూడుముళ్లు పడతాయనగా పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చిన యువతి బీభత్సం సృష్టించింది. యాసిడ్ చల్లి, కత్తి తీసి కల్యాణ మండపాన్ని రణరంగంగా మార్చింది. అరుపులు, కేకలతో పెళ్లి పందిరి దద్దరిల్లింది. ఏం జరుగుతోందో తెలియక పెళ్లికొచ్చిన వారు భయభ్రాంతులకు గురై కల్యాణ మండపం నుంచి పరుగులు తీశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.  

పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు తిరుపతికి చెందిన యువతితో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. బాషా ఇటీవల ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో అనుమానించిన ఆమె.. అతడిని వెతుక్కుంటూ రైల్వే కోడూరు వెళ్లి ప్రియుడి గురించి ఆరా తీసింది. ఆదివారం నందలూరులో అతడి వివాహం జరగనున్నట్టు తెలిసి నిర్ఘాంతపోయింది.

ప్రియుడిని నిలదీసేందుకు షాదీఖానాకు చేరుకుంది. వెళ్తూవెళ్తూ యాసిడ్, కత్తి పట్టుకెళ్లింది. తనతో ఉంటూ ఇదేం పని అని బాషాను నిలదీసింది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన యువతి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ సీసాను, కత్తిని బయటకు తీసింది. దీంతో అప్రమత్తమైన బంధువులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

తోపులాటలో ఆమె వద్దనున్న యాసిడ్ వరుడు బాషా పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళపై పడి గాయాలయ్యాయి. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఆమె వద్దనున్న కత్తిని లాక్కున్న బాషా ఆమె వీపు, భుజాలపై దాడిచేశాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ వధువు తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఇంకోవైపు, మీడియాతో మాట్లాడనివ్వకుండా వరుడి ప్రియురాలిని గదిలో బంధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *