Rifle Scope: జమ్మూకశ్మీర్‌లో భద్రతా వర్గాల్లో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలోని సిద్రా ప్రాంతంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (scope) లభ్యమైంది.
ఈ ఘటన భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేసింది. జమ్మూ జిల్లా శివార్లలోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఈ వస్తువు బయటపడింది.
చిన్నారి దానిని బొమ్మగా భావించి ఆడుతుండగా గ్రామస్థులు గమనించి, అది రైఫిల్‌కు అమర్చే స్కోప్ అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చెత్త కుప్పలో ఈ స్కోప్ లభించినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.
ALSO READ:Spirit Movie Update | బాహుబలి, కేజీఎఫ్ తరహాలో ప్రభాస్ ‘స్పిరిట్’?
పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది చైనాలో తయారైన రైఫిల్ స్కోప్‌గా నిర్ధారించారు. సాధారణంగా అసాల్ట్ రైఫిళ్లు, స్నిపర్ రైఫిళ్లకు అమర్చి దూరంలోని లక్ష్యాలను గుర్తించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
NIA కార్యాలయం, జమ్మూ-కశ్మీర్ పోలీస్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్, CRPF, SSB బెటాలియన్ కేంద్రాలకు సమీపంలో ఈ స్కోప్ లభించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన 24 ఏళ్ల తన్వీర్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్‌లో పాకిస్థానీ ఫోన్ నంబర్ ఉన్నట్లు గుర్తించి విచారణ చేపట్టారు.
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సహకారంతో సిద్రా ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
