జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నడిగడ్డలో జరిగిన సన్నాహక సమావేశం ఉత్సాహంగా సాగింది. యువజన నాయకుడు రామకృష్ణ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆంజనేయ గౌడ్ చురుకైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలో జీరో సర్కార్, కేంద్రంలో నీరో సర్కార్” అని విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కార్ నవతరం నెత్తురు తాగుతోందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ స్పూర్తితో, చల్లా ప్రోత్సాహంతో తాము నడిగడ్డలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బండ్ల బంగ్లా రాజకీయాలను ప్రజలు త్రస్కరిస్తారని, బహుజన నాయకత్వం పరిపుష్టి కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు. సభలో బాసు హన్మంతునాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్రాములు వంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం, డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు దారి చూపిన దిక్సూచి అని తెలిపారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. లక్షలాది మంది పార్టీ పండుగకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చక్రధర్, అంగడి బస్వరాజు, కిషోర్, శేఖర్ నాయుడు, రవి ప్రకాష్, బొప్పల శ్రీనివాస్, కుర్వ పల్లయ్య, తిరుమలేష్, మాల మల్లీ కార్జున్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువజన నాయకులు హాజరై సభకు శోభతోడు చేశారు. నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.