అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం మరో మలుపు తిరిగింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఆయస్కాంతాల వంటి కీలక పదార్థాల ఎగుమతులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఈ చర్యతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలపై ఒత్తిడి పెంచాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుధాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు అత్యవసరమైన ఈ పదార్థాల సరఫరా రుగ్మతకు గురయ్యే అవకాశం ఉంది.
చైనా ప్రభుత్వం కొత్త ఎగుమతుల నియంత్రణ విధానాన్ని రూపొందిస్తోంది. ఈ విధానాలు అమలులోకి వచ్చే వరకు, కీలకమైన పదార్థాల రవాణా నిలిపివేయబడిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా సైనిక రంగ కాంట్రాక్టర్లు, టెక్ సంస్థలకు రేర్ ఎర్త్ సరఫరా పూర్తిగా నిలిచే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ఓడరేవుల్లో సరుకుల నిలిపివేత ప్రారంభమైంది.
ట్రంప్ పాలనలో చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడంతో ప్రతీకార చర్యగా చైనా ఈ ఆంక్షలను అమలుచేస్తోంది. ప్రపంచ రేర్ ఎర్త్ ఉత్పత్తిలో 90% వరకు చైనా నుంచే వస్తోంది. సమేరియం, గడోలినియం, డిస్ప్రోసియం వంటి ముఖ్యమైన లోహాలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చారు. అమెరికాలో ఒకే ఒక్క రేర్ ఎర్త్ గని మాత్రమే ఉండటంతో, ఆ దేశం చైనా సరఫరాపైనే పూర్తిగా ఆధారపడుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు, స్మార్ట్‌ఫోన్లు, రోబోట్లు, క్షిపణులు, AI సర్వర్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాల తయారీలో ఈ పదార్థాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా తాజా ఆంక్షలతో ప్రపంచ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ చర్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నదని, దీని ప్రభావం టెస్లా, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.