అస్సాంలోని ప్రసిద్ధ కజిరంగా జాతీయ పార్కులో తాజాగా అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. బంగారు వర్ణంలో నాజూకైన చారలతో కనిపించిన ఈ పులిని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పులి రంగులో ఉండటానికి కారణం “సూడోమెలనిజం” అనే అరుదైన జన్యు మార్పు అని పశుసంరక్షణ నిపుణులు తెలిపారు. సాధారణంగా పులులకు గోధుమ రంగుతో కూడిన ముదురు చారలు ఉంటాయి. కానీ ఈ గోల్డెన్ టైగర్ కు స్వల్ప చారలతో పాటు బంగారు-నారింజ కలర్ ఉండడం ఎంతో విశేషం.
ప్రపంచంలో ఇలాంటి పులులు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణుల ప్రపంచంలో ప్రకృతి చేసే అద్భుతాలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి దృశ్యాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది.
గోల్డెన్ టైగర్‌ను ప్రత్యక్షంగా చూసిన సుధీర్ ఆనందానికి అవధుల్లేవు. “ఇది నా కెరీర్‌లోనే ఓ అత్యంత అరుదైన క్షణం” అని ఆయన అన్నారు. ప్రకృతిని ప్రేమించే వారందరూ ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. Kaziranga National Park మరింతగా ప్రసిద్ధి చెందుతోంది.