హజ్ యాత్ర సమయం దగ్గర పడుతున్న వేళ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. పలు దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ చర్య వల్ల యాత్రకు అవసరమైన నియమాలను పాటించని వారిని నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు.
గత ఏడాది హజ్ సమయంలో రిజిస్టర్ కాకుండా వచ్చిన యాత్రికుల వల్ల తీవ్రమైన తొక్కిసలాటలు, రద్దీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా 1200 మందికి పైగా యాత్రికులు మృతిచెందారు. ఇలాంటి దుర్విపాకాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఈసారి ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సౌదీ పాలకుడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో అధికారులు వీసా జారీ ప్రక్రియపై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. రిజిస్టర్ కాకుండా హజ్ యాత్రకు వచ్చే యాత్రికుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. దీనివల్ల యాత్ర మరింత సజావుగా జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
ఈ వీసా నిలిపివేత భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, ఈజిప్ట్ వంటి 14 దేశాలకు వర్తించనుంది. అయితే హజ్‌కు అధికారికంగా రిజిస్టర్ అయిన యాత్రికులు, దౌత్య అధికారులపై ఈ నిబంధనలు వర్తించవు. ఈ చర్యతో ప్రయాణికుల రద్దీ నియంత్రించబడుతుందని అంచనా.