అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి గ్రామస్తులు గత 60-70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి కోసం పోరాటం చేస్తున్నారు. సర్వే నంబర్లు 1750 నుండి 1754 వరకు ఉన్న భూమిని వైసీపీ నేత యర్రపరెడ్డి నల్ల ఆనంద్ రెడ్డి, అతని కుమారుడు ఆరం రెడ్డి అక్రమంగా డికేటి పట్టాలు పొందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ హయాంలో అక్రమంగా పట్టాలు చేయించుకుని, మామిడి చెట్లు నాటుకుంటూ భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఈ భూవివాదంలో గ్రామస్థులపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా, ప్రతిఘటించే వారిపై పోలీసు కేసులు పెట్టిస్తున్నారు. అధికారులు కూడా వైసీపీ నేతల మాటలు వినిపిస్తూ గ్రామస్తులను హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వైసీపీ నేతలు చెప్పినట్లుగానే వ్యవహరించారని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. తమకున్న భూమిని తిరిగి అప్పగించాలని, నిరుపేద వడ్డెర కులస్తులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రభుత్వం వెంటనే ఈ వివాదంలో దర్యాప్తు జరిపి, అక్రమంగా భూమి హస్తాంతరమైనట్లు తేలితే భూమిని తిరిగి గ్రామస్తులకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ పట్ల న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.