నందలూరు బస్టాండ్‌లో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో, ఇద్దరు ముస్లిం మహిళలు, ఒక చిన్నారి ప్రయాణించారు. వారు టికెట్‌కు రూ. 500 ఇచ్చినా చిల్లర కోసం ఆలస్యం అవుతుందని కండక్టర్ పేర్కొన్నాడు. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు బంధువులను ఫోన్ ద్వారా పిలిపించి, బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడికి ప్రేరేపించారని సమాచారం.
బస్సు నందలూరులో ఆగగానే మహిళల బంధువులు కండక్టర్‌పై దాడి చేశారు. దీంతో ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు డిపో మేనేజర్ రమణయ్య, నందలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కండక్టర్‌పై దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ ఘటనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ, సమస్య ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చు గానీ, ఉద్యోగిపై దాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజా సేవ చేసే రవాణా కార్మికులను ఇలా దాడి చేస్తే భవిష్యత్‌లో వారు పనికి వస్తారా? అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికుల హక్కులను కాపాడేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.