హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం గందరగోళం నెలకొంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శ్రీనగర్ నుంచి రావాల్సిన ఫ్లైట్ అనుకున్న సమయానికి రన్‌వేపైకి రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.
ఫ్లైట్ ఆలస్యం గురించి ఎయిరిండియా ప్రతినిధులను ప్రయాణికులు ప్రశ్నించగా, వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ముందుగా ఆలస్యం గురించి తెలియజేయకుండా బోర్డింగ్‌ను ఎందుకు ప్రకటించారనే విషయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ షెడ్యూల్‌లో సమాచారం లేకుండా ప్రయాణికులను విమానాశ్రయంలో నిరీక్షింపజేయడం సరికాదని విమర్శలు గుప్పించారు.
విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో బిజినెస్ మీటింగ్స్, ప్రైవేట్ షెడ్యూల్స్ ఉన్న ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఎయిరిండియా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నిరసన వ్యక్తం చేశారు. కొంతసేపు ప్రయాణికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం ఎయిరిండియా సిబ్బంది ఫ్లైట్ ఆలస్యానికి గల కారణాలను వివరించడంతో పరిస్థితి శాంతించింది. అయినప్పటికీ ప్రయాణికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.