సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా, పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవూరు ఎస్.డబ్ల్యూ పరిధిలోని 7 వసతి గృహాల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని వాచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రైనీ డీఎస్పీ శివప్రియ పాల్గొని, విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు.
ట్రైనీ డీఎస్పీ శివప్రియ మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని, ఈ దశలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనలో శ్రమించాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ట్రస్టు వ్యవస్థాపకులు పెద్ది మారుతి నాగార్జున, సత్యవతి గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నరసింహమూర్తి మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని విజయం సాధించాలని ఆయన సూచించారు.
అనంతరం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్‌ఫోన్, సోషల్ మీడియా వంటి వాటికి ఆకర్షితులు కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఓ. తిరుపతయ్య, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రస్ట్ అందించిన ఈ సహాయాన్ని విద్యార్థులు హర్షిస్తూ, భవిష్యత్తులో మద్దతుగా నిలవాలని కోరారు.