మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షం అనేది ప్రజలు నిర్ణయిస్తారని, కేంద్రం నిర్ణయించదని తెలియని జగన్ ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తమ నియోజకవర్గంలో 14 శిలాఫలకాలు పెట్టారని, ఇప్పుడు తమ సీఎం నిధులు కేటాయించి అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారని తెలిపారు.
ఆడపిల్లలకు గౌరవం ఇవ్వని జగన్, మహిళల భద్రతపై మాట్లాడే అర్హత లేదని సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో ప్రజలను మోసం చేశారని, ఐదు సంవత్సరాల పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చివరికి ‘సాక్షి’ క్యాలెండరే ఇచ్చారని విమర్శించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మార్చి చివర్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వ హయాంలో మొత్తం 10 లక్షల ఉద్యోగాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ప్రతి విద్యార్థి తల్లికి ఇచ్చిన ‘అమ్మకు వందనం’ మొత్తాన్ని మళ్లీ అందజేస్తామని తెలిపారు. స్కూళ్లు ఓపెన్ అయ్యే సమయానికి ఈ పథకం అమలులోకి వస్తుందని వివరించారు.
ఈ పత్రికా సమావేశంలో ఆమె టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలు నమ్మకంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాలను వేగంగా పూర్తి చేసి, ప్రతి నిరుద్యోగికి భరోసా కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఆ మోసాన్ని అందరూ గుర్తించాలన్నారు.